Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష ఆదేశంలో మార్పు

యెమెన్‌లో హత్య కేసులో మరణశిక్ష పడి, పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న కేరళ నర్సు నిమిష ప్రియా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె ఉరిశిక్ష ఆదేశాన్ని యెమెన్ అధికారులు తాత్కాలికంగా మార్పు చేశారు. మరోవైపు, ఆమెను కాపాడి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు కొత్త మధ్యవర్తిని నియమించినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
గురువారం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. 'సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను కోర్టుకు సమర్పించింది. నిమిష ప్రియా తరఫు న్యాయవాది మాట్లాడుతూ, "నిమిష మరణశిక్ష ఆదేశం తాత్కాలికంగా మార్చబడింది" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేయాలని కోరగా, సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అవసరమైతే ముందుగా కూడా విచారణకు అభ్యర్థించవచ్చని సూచించింది.
కేరళకు చెందిన నిమిష ప్రియా 2011లో నర్సుగా యెమెన్‌కు వెళ్లింది. 2015లో స్థానిక పౌరుడైన తలాల్ అబ్దో మహ్దీ భాగస్వామ్యంతో సనా నగరంలో ఒక క్లినిక్ ప్రారంభించింది. అయితే, తలాల్ నకిలీ వివాహ పత్రాలు సృష్టించి తనను భార్యగా చెప్పుకుంటూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడని నిమిష ఆరోపించింది. తన పాస్‌పోర్టును, ఆదాయాన్ని లాక్కుని వేధించాడని ఆమె తెలిపింది. అతని బారి నుంచి తప్పించుకుని పాస్‌పోర్ట్ తిరిగి పొందేందుకు, 2017లో అతనికి మత్తుమందు ఇచ్చింది. కానీ, డోస్ ఎక్కువ కావడంతో తలాల్ మరణించాడు.
ఈ హత్య కేసులో యెమెన్ పోలీసులు నిమిషాను అరెస్టు చేశారు. విచారణ జరిపిన స్థానిక కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆమె చేసుకున్న అప్పీళ్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరికి 2024లో యెమెన్ అధ్యక్షుడు కూడా మరణశిక్షను ఆమోదించడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిణామాలతో నిమిష ప్రియా కుటుంబ సభ్యులు, ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com