Supreme Court: నేపాల్, బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో చూడండి : సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపునకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వారం నేపాల్‌లో, గత ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల గురించి కోర్టు ప్రస్తావించింది. ‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో ఓ సారి చూడండి’ అంటూ వ్యాఖ్యానించింది. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు నెలకు పైగా తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడాన్ని కేంద్రప్రభుత్వ తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన క్రమంలో సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
మన రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉంది..
‘ఒకసారి మన చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి.. నేపాల్‌లో పరిస్థితులను ఒకసారి చూడండి. ఈ పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. దీనిని అంగీకరించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ‘నిజమే. బంగ్లాదేశ్‌లో కూడా గత ఏడాది ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. విద్యార్థులు నిర్వహించిన నిరసన ఉద్యమం ప్రభుత్వం భవనాల స్వాధీనంతో పాటు వాటి ధ్వంసానికి దారితీశాయి. వారు ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా నాశనం చేశారు’ అని పేర్కొన్నారు. కాగా, 90 శాతం బిల్లులు నిర్దేశిత గడువులోగానే గవర్నర్ ఆమోదం పొందుతున్నాయని తుషార్ మెహతా పేర్కొన్నారు. 1970-2025 మధ్య కేవలం 20 బిల్లులను మాత్రమే గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని ఆయన చెప్పారు. అయితే ఈ గణాంకాలను తాము పరిగణనలోకి తీసుకోలేమని, రాష్ట్రం కోణంలో ఇది ఎంతమాత్రం సబబు కాదని సీజేఐ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com