Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేము..సుప్రీం సంచలన తీర్పు..

Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేము..సుప్రీం సంచలన తీర్పు..
X
బిల్లుల విషయంలో గవర్నర్‌కు 3 మార్గాలు

రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌)పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి లేదు’’ అని అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసింది. గవర్నర్లు బిల్లులు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే రాజ్యాంగ కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉందని చెప్పింది. తాము గవర్నర్లకు పరిమిమైన సూచనలు మాత్రమే ఇవ్వగలని వ్యాఖ్యానించింది.

బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ ముందు 3 మార్గాలు మాత్రమే ఉన్నాయని- ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం గవర్నర్ అధికారాలు అని చెప్పింది. బిల్లులపై మూడు నెలల గడవు విధించి తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల్ని సంధించారు. ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు రిఫరెన్స్‌ను రాష్ట్రపతి అడిగారు. రాష్ట్రపతి రిఫరెన్స్ పై వాదనలు విన్న సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, సెప్టెంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రోజు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

సీజేఐ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్లులు సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయవ్యవస్థ గడువు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం పరిధిని అతిక్రమించడమే అని కేంద్రం కోర్టుకు తెలిపింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి. జస్టిస్ గవాయ్ రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందు ఈ సంచలన తీర్పు వచ్చింది.

Tags

Next Story