Mumbai Train Blasts: ముంబయి రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే

ముంబయి ట్రైన్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర కేసులు ఏవీ లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో నిందితులను అధికారులు విడుదల చేశారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, ఇప్పటికే విడుదల చేసిన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ పై స్పందన తెలియజేయాలని 11 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది.
2006 లో ముంబయిలోని సబర్బన్ రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. మొత్తం 189 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 800 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు 12 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు వారిని జైలుకు పంపించింది. బాంబులు అమర్చినట్లు తేలిన ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. దీనిపై నిందితులు హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇటీవల వారందరినీ హైకోర్టు నిర్దోషులుగా తేల్చి విడుదలకు ఆదేశించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న కాలంలో నిందితుల్లో ఒకడు నాగ్ పూర్ జైలులో మరణించాడు. హైకోర్టు తీర్పుతో పదకొండు మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com