Supreme Court : పురుషులకు నెలసరి వస్తే అప్పుడు తెలుస్తుంది!

Supreme Court : పురుషులకు నెలసరి వస్తే అప్పుడు తెలుస్తుంది!
X
మధ్యప్రదేశ్‌ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఒక వేళ పురుషులు కనుక నెలసరి వస్తే ఈ బాధ అర్థమై ఉండేది’ అని వ్యాఖ్యానించింది. ‘పురుషులకూ రుతుక్రమం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే వారికి మహిళల బాధ తెలుస్తుంది’ అని ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్‌ బీవీ నాగరత్న అన్నారు.

మహిళా జడ్జీల తొలగింపు విషయంలో హైకోర్టు వైఖరిని సుప్రీం కోర్టు తప్పుబడుతూ కేసును సుమోటోగా స్వీకరించినట్టు తెలిపింది. ‘ముఖ్యంగా మహిళలు విధి నిర్వహణలో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుంటే, నెమ్మదిగా ఉన్నారంటూ వారిని ఇంటికి పంపకండి. పురుష న్యాయమూర్తులు, న్యాయాధికారులకు ఒకే ప్రమాణాలు ఉండనివ్వండి. అప్పుడు ఏం జరుగుతుందో, మీరు జిల్లా న్యాయవ్యస్థలో లక్ష్యాన్ని ఎలా సాధించగలరో మాకు తెలుసు’ అని పేర్కొంది. ‘ఏదైనా కేసును డిస్మిస్‌-డిస్మిస్‌ అని ఇంటికి వెళ్లిపోవచ్చు. మేము విచారిస్తున్న ఈ కేసు కూడా నెమ్మదిగా సాగుతున్నదని న్యాయవాదులు అనగలరా’ అని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.

Tags

Next Story