Bihar Reservation Law: రిజర్వేషన్ల పెంపుపై నితీశ్ సర్కార్కు ఎదురుదెబ్బ

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గత ఏడాది నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారు ఓ చట్టాన్ని తయారు చేసింది. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటీషన్ వేయడంతో.. పాట్నా హైకోర్టు 65 శాతం కోటాను కొట్టిపారేసింది. పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ బీహార్ సర్కారు పెట్టుకున్న అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టింది. 65 శాతం కోటాపై తాత్కాలిక ఆదేశాలు ఏమీ ఉండవని, ఈ కేసును సెప్టెంబర్‌లో తుది విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఉద్యోగం, విద్య అంశాల్లో సమానత్వ హక్కును బీహార్ సర్కారు ఉల్లంఘించిందని కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 20వ తేదీన హైకోర్టు 65 శాతం కోటా చట్టాన్ని నిలిపివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 అతిక్రమించినట్లు అవుతుందని హైకోర్టు తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్నారని, అందుకే 1991 నాటి రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని గత ఏడాది బీహార్ సర్కారు తీర్మానించింది. దీంతో రిజర్వ్డ్ క్యాటగిరీల్లో రిజర్వేషన్‌ను 65 శాతానికి పెంచారు. అయితే దీని వల్ల మెరిట్ క్యాటగిరీలో కోటా 35 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్ ఆధారంగా బీసీలు ఎక్కువే ఉద్యోగాలు పొందినట్లు ఓ సర్వే రిపోర్టును హైకోర్టు అంగీకరించింది. అందుకే రిజర్వేషన్ అంశంపై పునరాలోచించాలని హైకోర్టు తన తీర్పులో చెప్పింది.
పాట్నా హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని కోరుతూ బీహార్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్.. బీహార్ ప్రభుత్వం తరపున వాదించారు. అయినా కోర్టు మాత్రం ఆయన వాదనను వినిపించుకోలేదు. తాత్కాలిక రిలీఫ్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com