Yashwant Varma నోట్ల కట్టల కేసు- సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మకు చుక్కెదురు

నగదు కుంభకోణం కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను తాజాగా న్యాయస్థానం కొట్టేసింది. క్యాష్ ఎట్ హోమ్ కుంభకోణంలో ఆయనపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పిటిషన్ కొట్టేయడంతో అభిశంసన ప్రక్రియకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ విజ్ఞప్తిపై జనవరి 8న నిర్ణయాన్ని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.సి.శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. దీంతో జస్టిస్ వర్మ.. పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వర్మపై అభిశంసన వేటు పడే అవకాశం ఉంటుంది.
జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
మార్చి 14, 2025న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ కూడా నగదు ఉన్నమాట వాస్తవమేనని తేల్చింది. మే 4న కమిటీ నివేదిక ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

