Supreme Court: ప్రభుత్వ రహదారుల్లో నడపకపోతే మోటారు వాహనాల పన్ను చెల్లించక్కర్లేదు

దేశవ్యాప్తంగా వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆగస్టు 29న ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పన్ను విధింపుపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, హైవేల వంటి ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ప్రతిఫలంగా వాహన యజమానులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.
అయితే, ఒక వాహనాన్ని రోడ్లపైకి తీసుకురాకుండా, పూర్తిగా వాడకంలో లేకుండా పక్కన పెట్టినప్పుడు, దాని యజమాని ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినట్లు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. "అలాంటి పరిస్థితుల్లో, వాహనం వినియోగంలో లేని కాలానికి యజమానిపై మోటారు వాహన పన్ను భారం మోపడం సరికాదు" అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వాడకుండా నిలిపివేసిన వాహనాలు ఉన్న యజమానులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com