Supreme Court: సుప్రీంకోర్టులోకి అకస్మాత్తుగా ఉగ్రవాది.. అవాక్కైన జడ్జీలు

Supreme Court: సుప్రీంకోర్టులోకి అకస్మాత్తుగా ఉగ్రవాది.. అవాక్కైన జడ్జీలు
సుప్రీంకోర్టులోకి అకస్మాత్తుగా ఉగ్రవాది యాసిన్‌ మాలిక్‌.... ఆశ్చర్యపోయిన జడ్జీలు.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన...

సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఓ ఉగ్రవాదిని చూసి న్యాయమూర్తులు దిగ్భ్రాంతి చెందారు. తమ అనుమతి లేకుండా.. తాము ఆదేశించకుండా సర్వోన్నత న్యాయస్థానంలో అతడు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది.


కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(Jammu Kashmir Liberation Front) చీఫ్ యాసిన్ మాలిక్( Yasin Malik) అకస్మాత్తుగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రత్యక్షమయ్యాడు. ఉగ్ర నిధుల కేసులో కేసులో తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్ ఎలాంటి అనుమతి లేకుండా సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టాడు. ఊహించని ఈ సంఘటనకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆశ్చర్యపోయింది. వ్యక్తిగతంగా మాలిక్‌ను హాజరుకావాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. అక్కడే ఉన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర భద్రతా లోపంగా పేర్కొన్నారు. యాసిన్ మాలిక్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం సెక్రటరీకి సొలిసిటర్ జనరల్(Solicitor General) తుషార్ మెహతా(Tushar Mehta) లేఖ రాశారు.

జీవితఖైదు శిక్షల అనుభవిస్తున్న యాసిన్‌ మాలిక్‌ శుక్రవారం అనూహ్యంగా సుప్రీంకోర్టులోకి ప్రవేశించి.. తన కేసును తానే వాదించుకుంటానంటూ ధర్మాసనం ముందుకు వచ్చారు. ఈ ఘటనతో జడ్జిలు ఆశ్చర్యపోయారు. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ ఇలా ఎలా రాగలుగుతారని ప్రశ్నించారు.


హైరిస్క్‌ కేటగిరీలో ఉన్న ఖైదీని జైలు అధికారులు ఈ విధంగా ఎలా తీసుకు రాగలుగుతారని సొలిసిటర్‌ జనరల్‌ (SG) కూడా అయోమయానికి లోనయ్యారు. కోర్టు నుంచి వెళ్లిన లేఖను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని చివరకు గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఢిల్లీ జైళ్ల శాఖ అదేశించింది. యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్నారు. 1989లో అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తి మహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబియా సయీద్‌ కిడ్నాప్‌ కేసు విచారణ సందర్భంగా ఆయనను ప్రత్యక్షంగా హాజరుపరచాలంటూ ఆ కేసును విచారిస్తున్న జమ్మూ-కశ్మీర్‌లోని టాడా ప్రత్యేక కోర్టు 2022 సెప్టెంబరు 20న ఆదేశించింది.

భద్రత కారణాల దృష్ట్యా ఆయనను భౌతికంగా హాజరుపరచడం తగదని సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. సీబీఐ అప్పీలు విచారణకు రానుండడంతో తాను స్వయంగా హాజరయ్యేందుకు అవకాశం కలిగించాలని యాసిన్‌ మాలిక్‌ సుప్రీకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. దీంతో పాటు అఫిడవిట్‌ కూడా సమర్పించారు. తగిన ఉత్తర్వుల కోసం ఆ అఫిడవిట్‌ను సంబంధిత ధర్మాసనం ముందు ఉంచుతానని సుప్రీంకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఈ నెల 18న లేఖ రాశారు.

ఈ లేఖను తప్పుగా అర్థం చేసుకున్న జైలు అధికారులు..ధర్మాసనం అనుమతి ఇచ్చిందని భావించి యాసిన్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రకటించారు. దీంతో కేసును వేరే ధర్మాసనానికి పంపిచేలా సీజేఐని కోరాలని జస్టిస్‌ సూర్యకాంత్‌.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story