Supreme Court: రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court: రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court: ఉచిత హామీల విషయంలో బీజేపీ సహా అన్ని పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

Supreme Court: ఉచిత హామీల విషయంలో బీజేపీ సహా అన్ని పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పార్టీలన్నీ ఉచితాలకు అనుకూలంగానే ఉన్నాయంది. ఎన్నికల సందర్భంగా పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉచితాలపై వివిధ పార్టీల అభిప్రాయాలు వింటున్న సుప్రీంకోర్టు.. తాజాగా డీఎంకే వివరణను తీసుకుంది. ఐతే అట్టడుగు వర్గాల కోసం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలుగా చూడొద్దని విజ్ఞప్తి చేసింది డీఎంకే.

ముందు ఏది ఉచితమో, ఏది సంక్షేమమో తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపింది సుప్రీంకోర్టు. దీనిపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలనే.. ఓ కమిటీ ఏర్పాటు గురించి ప్రస్తావించామని తెలిపింది. కానీ కొందరేమో వీటిని ప్రోత్సహించే హక్కు తమకు లేదని.. సమస్యను పలిశీలించే హక్కు కూడా లేదంటున్నారని వివరించింది. ప్రభుత్వ విధానాలు, పథకాలకు తాము విరుద్ధం కాదని.. కానీ వీటిపై సమతుల్యం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఉచితాలపై పర్యవేక్షణ సాగించేందుకు స్టాట్యుటరీ ఫైనాన్స్ కమిషన్ ప్యానల్ ఏర్పాటు చేయాలని.. ఈ కేసులో కోర్టుకు సహకరిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రతిపాదించారు.

సమస్యను వ్యవస్థీకృతంగా పరిష్కరించాలని, రాజకీయకోణంలో కాదని సూచించారు. కేసు విచారణలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని రాష్ట్రాలు.. పేదలు, మహిళలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నాయని.. వీటి వల్ల అనేక మంది జీవితాలు మెరుగుపడ్డాయని నివేదికల ద్వారా తెలుస్తోందన్నారు. అయితే, ఇక్కడ ఏది ఉచితాలు, ఏది కాదనేదే సమస్య అన్నారు. సామాజిక సంక్షేమ పథకాల విషయంలో తమకు ఎలాంటి సమస్యలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే, కొన్ని పార్టీలు అత్యవసరం కాని వస్తువులైన టీవీ సెట్లను పంపిణీ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని కొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయన్న ఆయన.. ఓ వైపు కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికస్థితి సరిగా లేనప్పుడు తప్పుడు హామీలు ఇవ్వడం మంచిది కాదని అన్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినవారమవుతామని చెప్పారు. ఇది విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story