Azam Khan: ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజం ఖాన్‌ కు కాస్త ఊరట

Azam Khan:  ద్వేషపూరిత ప్రసంగం కేసులో  ఆజం ఖాన్‌ కు కాస్త ఊరట
వాయిస్ శాంపిల్ ఇవ్వాలన్న ట్రయల్ కోర్ట్ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

విద్వేషపూరిత ప్రసంగం, అవమానకరమైన పదజాలం కేసులో .. వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

2007లో రాంపూర్‌లోని తండా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై విద్వేషపూరిత ప్రసంగం, అవమానకరమైన పదజాలం ఉపయోగించారంటూ ధీరజ్ కుమార్ షీల్ అనే వ్యక్తి ఆజం ఖాన్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. వీటితో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్‌లు 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 171-జి (ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటన) కింద కేసు నమోదు చేయబడింది. పోలీసులు సమాజ్‌ వాద్‌ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌పై ప్రజాప్రాతినిధ్య చట్టం మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ 125ని కూడా ఉపయోగించి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీడీలో రికార్డ్ చేయబడిన ఖాన్ ప్రసంగంతో సరిపోలడానికి వాయిస్ నమూనాను ట్రయల్‌ కోర్టు కోరింది. జులై లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు వాటిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆజం ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ఫిర్యాదుదారుకు కూడా నోటీసులు జారీ చేసింది.


ప్రతివాదికి నోటీసు జారీ చేయాలని.. అక్టోబర్ 29, 2022 నాటి ట్రయల్ కోర్ట్ ఉత్తర్వుపై, జులై 25న అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధించబడుతుందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అయితే ఆజం ఖాన్ మాటతీరుపై కేసులుండటం కొత్తేమి కాదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాంపూర్ మాజీ ఎమ్మెల్యే అయిన అజాం ఖాన్ మీద 90కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఖాన్‌కు కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అక్టోబర్‌లో ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story