Supreme Court: రెండో భార్యకూ పింఛన్‌

Supreme Court: రెండో భార్యకూ పింఛన్‌
X
23 ఏండ్లు పోరాడిన మహిళపక్షాన నిలిచిన అత్యున్నత న్యాయస్థానం

భార్య ఉండగా రెండో పెండ్లి చేసుకోవడం తప్పు అంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నో తీర్పులు ఇచ్చింది. అయితే, తన భర్త చనిపోయాడని, తనకు కంపెనీ నుంచి రావాల్సిన పింఛన్‌ను ఇప్పించాల్సిందిగా ఓ మహిళ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, చనిపోయిన వ్యక్తికి ఆమె రెండో భార్య. మొదటి భార్య బతికి ఉండగానే అతను ఈమెను వివాహం చేసుకొన్నాడు. ఎంతో ప్రత్యేకమైన ఈ కేసులో సుప్రీంకోర్టు మహిళ పక్షానే నిలిచింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ఆమెకు రావాల్సిన పింఛన్‌ ఇవ్వాల్సిందేనని సదరు కంపెనీని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. దీన్నో ప్రత్యేకమైన కేసుగా అభివర్ణించింది.

జయ్‌ నారాయణ్‌ మహారాజ్‌ అనే వ్యక్తి సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌లో పనిచేస్తూ 1983లో రిటైర్‌ అయ్యారు. ఆయన భార్య పేరు రామ్‌ సవారీ దేవి. జయ్‌ నారాయణ్‌.. రాధాదేవి అనే మహిళను రెండో పెండ్లి కూడా చేసుకొన్నాడు. ముగ్గురూ కలిసి అన్యోన్యంగా ఉండేవారు. అయితే, 1984లో రామ్‌ సవారీ దేవీ మరణించారు. వచ్చే పింఛన్‌తో రెండో భార్యతో కలిసి జయ్‌ నారాయణ్‌ రోజులు గడిపాడు. అయితే, 2001లో జయ్‌ నారాయణ్‌ కూడా కాలంచేశాడు. దీంతో వయసు పైబడిన తనకు పింఛన్‌ ఇప్పించాల్సిందిగా జయ్‌ నారాయణ్‌ పనిచేసిన కంపెనీని 2001లో రాధాదేవి కోరారు. దీనికి కంపెనీ నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా చుక్కెదురవ్వడంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.

కేసు మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142లోని ప్రత్యేక అధికారాలను వినియోగించి రాధాదేవికి పింఛన్‌ ఇవ్వాలంటూ కంపెనీని ఆదేశించింది. మొదటి భార్య ఉండగానే రాధాదేవి జయ్‌ నారాయణ్‌ను పెండ్లి చేసుకొన్నప్పటికీ, వాళ్లు ముగ్గురు అన్యోన్యంగా ఉన్నారని ధర్మాసనం గుర్తుచేసింది. దీన్ని బట్టి రెండో వివాహానికి మొదటి భార్య రామ్‌ సవారీ దేవి ఎలాంటి అడ్డంకి చెప్పలేదని తాము అర్థంచేసుకొన్నట్టు వెల్లడించింది. 2010 నుంచి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన పింఛన్‌ మొత్తాన్ని రాధాదేవి బ్యాంకు ఖాతాలో డిసెంబర్‌ 31లోగా జమ చేయాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.

Tags

Next Story