Supreme: హిమాచల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విప్ ను ధిక్కరించి అనర్హత వేటుకు గురైన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. వారిని అనర్హులుగాప్రకటిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో సభాపతి కల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలనిఆదేశించింది. తాము ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలియజేయగా ఆ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అనర్హత వేటును నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది.
అనర్హత వేటు పడ్డ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాల్లో పొల్గొనడానికి, ఓటు వేయడానికి అనుమతించరాదని పేర్కొంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కోర్టు దానిలో జోక్యం చేసుకోదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అన్నారు. సాధారణంగా ఏదైనా వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వాదనలు విన్న తర్వాత పిటిషనర్లు వారంలోగా తమ సమాధానాన్ని దాఖలు చేయవచ్చునని పేర్కొంటూ కేసును మే 6కి వాయిదా వేసింది.
కాగా, ఈ ఆరు స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. హిమాచాల్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఫిబ్రవరి 29న అసెంబ్లీ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్పీకర్ తమకు ఇచ్చిన నోటీస్‌పై స్పందించడానికి తగిన సమయం ఇవ్వకుండానే తమపై అనర్హత వేటు వేశారంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com