Gujarat : సూరత్‎లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ఆరంతస్తుల భవనం ఆకస్మాత్తుగాకుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్‌ లోని సూరత్‌లో శనివారం మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 2017-18లో ఈ భవనం నిర్మించినప్పటికీ 6 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకుందని ఓ నివేదిక తెలిపింది. దీంతోపాటు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ భవనం యజమానిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అయితే నిర్మించిన ఆరేళ్లకు కూప్పకూలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రమాదం తర్వాత రెస్క్యూ టీమ్ రాత్రంతా శిధిలాలను తొలగిస్తూనే ఉంది. భవనంలో మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ గుమికూడిన జనాన్ని అక్కడి నుంచి అధికారులు తొలగించారు. శాంతి, సహకారం కోసం విజ్ఞప్తి చేశారు. ప్రమాదం గురించి సమీపంలోని వ్యక్తుల నుండి సమాచారం సేకరించినట్లు అధికారి తెలిపారు. క్షతగాత్రులను విచారిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రమాద సమాచారం కుటుంబ సభ్యులకు చేరింది. ఈ ప్రమాదంపై స్థానికులు మాట్లాడుతూ.. సూరత్‌లో ఇలాంటి ఇళ్లు చాలా ఉన్నాయని, ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్నాయన్నారు. అలాంటి ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు. అలాంటి ఇళ్ల జాబితా తయారు చేయాలి. అటువంటి గృహయజమానులు తమ ఇళ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. ప్రమాదంపై విచారణ జరుపుతామని ఓ అధికారి తెలిపారు.

Tags

Next Story