Maharashtra: మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు కలకలం..

మహారాష్ట్ర సముద్రతీరంలో ఓ విదేశీ బోటు కలకలం రేపుతోంది. రాయ్‌గఢ్ జిల్లాలోని రేవ్‌దండాలో గల కొర్లై తీరం సమీపంలో అనుమానాస్పద బోటును భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు తీర ప్రాంతంలో భద్రతను పెంచారు.
రేవ్‌దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించింది. పడవకు పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్లు సమాచారం. అది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద పడవ గురించి సమాచారం అందుకున్న రాయ్‌గఢ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో అక్కడికి చేరుకొన్నారు. నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది కూడా తీరానికి చేరుకున్నట్లు రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు.
ఈ అనుమానాస్పద పడవ ఘటన ముంబై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేస్తుండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది హై అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంతోపాటు రాయ్‌గఢ్ జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు ముందుజాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు అనుమానాస్పద పడవ నుంచి రెడ్‌లైట్ వస్తున్నట్లు గుర్తించారు. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com