Swati Maliwal: కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’అంటూ స్వాతి మలివాల్ విమర్శలు..

Swati Maliwal:  కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’అంటూ  స్వాతి మలివాల్ విమర్శలు..
X
కేజ్రీవాల్‌పై ‘‘శీష్ మహల్ 2.0’’ ఆరోపణలు..

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై శీష్ మహల్2.0 ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ముందు ఆయన విలాసవంతమైన భవనం వివాదంగా మారింది. అయితే, ఇప్పుడు ఛండీగఢ్‌లో కూడా ఇలాంటి భవనాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ తిరుగుబాటు నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’గా పనిచేస్తున్నారని, షీష్ మహల్ ఇచ్చినట్లు మాన్ అంగీకరించారని మలివాల్ ఆరోపించారు.

ప్రభుత్వం ఆస్తిని ఉపయోగించడం గురించి మాట్లాడుతూ.. పంజాబ్ పరిపాలన దాని ప్రస్తుత స్థితి, ఖర్చు,నివాసితులకు సంబంధించి పూర్తి బహిర్గతం చేయాలని మలివాల్ డిమాండ్ చేశారు. శీష్ మహల్ ఆరోపణలను భగవంత్ మాన్ తోసిపుచ్చిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమైన శీష్ మహల్స్ బీజేపీ నేత కెప్టెన్ అమరిందర్ సింగ్, ఎస్ఏడీ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు చెందినవని పేర్కొన్నారు.

“భగవంత్ మాన్ జీ, మీరు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ జీని పంజాబ్ సూపర్ సీఎంగా గుర్తించారు, అందుకే మీరు ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మీ స్వంత ప్రకటనలో, కేజ్రీవాల్ ఈ ఇంట్లో నివసిస్తున్నారని మీరు అంగీకరించారు. నేను చెప్పేది కూడా అదే.” అని స్వాతి మలివాల్ పోస్ట్ చేశారు. “ఎవరి ఆదేశాల మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్‌ను అతిథి గృహంగా మార్చారు? దానిని బుక్ చేసుకునే విధానం ఏమిటి? గత మూడు సంవత్సరాలుగా అక్కడ ఎవరు అతిథులుగా బస చేశారు, ఏ ప్రాతిపదికన ప్రభుత్వ సౌకర్యంలో ఉచితంగా ఉండటానికి అనుమతిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.

ఢిల్లీలో శీష్ మహల్ కోల్పోయిన తర్వాత పంజాబ్‌లోని తన పార్టీ ప్రభుత్వం చండీగఢ్ లో 2 ఎకరాల్లో విస్తరించి ఉన్న విలాసవంతమైన 7-స్టార్ ప్రభుత్వ భవనాన్ని కేజ్రీవాల్‌కు అందించిందని బీజేపీ పేర్కొంది. ఢిల్లీలో శీష్ మహల్ తర్వాత, కేజ్రీవాల్ చండీగఢ్ శీష్ మహల్ 2.0ని సిద్ధం చేశారని, దీనికి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని, పంజాబ్ ప్రభుత్వం ఈ అద్భుతమైన బంగ్లాను అతడికి ఏ కోటా కింద అందించిందో తెలియదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. కేజ్రీవాల్ పంజాబ్ ఎంపీ లేదా ఎమ్మెల్యే కాదని అన్నారు.

Tags

Next Story