Switzerland: బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా

Switzerland: బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా
కొత్త చట్టం తెచ్చిన స్విట్జర్లాండ్ ఉల్లంఘిస్తే రూ.91,000 జరిమానా

ముస్లిం మహిళలకు బురఖా అనేది సంప్రదాయం. ఈ బురఖా విషయంలో ఎన్నో వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బురఖాపై స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బురఖాను నిషేధిస్తు తెచ్చిన బిల్లుకు ఆమోదం పలికింది. ఈ బిల్లు ప్రకారం స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే భారీ జరిమానా తప్పదు. బుధవారం ఉదయం స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో పాటు ఇంకేదైనా వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణింపబడుతుంది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్-వింగ్ పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ సమర్థించింది. కొంత మంది దీనిని వ్యతిరేకించినప్పటికి అనుకూలంగా 151-29 ఓట్లతో దీనికి గణనీయమైన మద్దతు లభించింది.


రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా బురఖా నిషేధంపై స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించింది. దేశ వ్యాప్తంగా ప్రజలు బురఖా ధరించటానికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. దీనిలో 51% మంది స్విస్ ఓటర్లు నిఖాబ్‌లు (కంటి దగ్గర మాత్రమే కనిపించేలా ఉండే ముసుగులు), బురఖాలు, అలాగే కొంతమంది నిరసనకారులు ధరించే స్కీ మాస్క్‌లు, బందన్నాలపై నిషేధం విధించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో దీనిని చట్టంలా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. దిగువ సభ ఆమోదంతో, నిషేధం ఇప్పుడు చట్టంగా మారింది. ఇక దీనిని ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానా విధించనున్నారు. ఈ రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా 1,000 స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు మన కరెన్సీలో రూ. 91,300 వరుకు జరిమానా విధిస్తారు. అయితే దీనిని ముస్లిం సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. పబ్లిక్ స్థలాలు మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైవేట్ భవనాలు రెండింటిలోనూ కొన్ని మినహాయింపులు అనుమతించబడతాయి. బెల్జియం, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో కూడా ఇలా ప్రైవేటు ప్రదేశాల్లో ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదనే నిబంధనలు ఉన్నాయి.

Tags

Next Story