Taj Mahotsav: ఆగ్రాలో ఘనంగా తాజ్ మహోత్సవ్

విదేశాల్లో హాట్ ఎయిర్ బెలూన్ సఫారీలకు ఆదరణ ఉన్నా...భారత్‌లో ఇంకా వాటికి ఆస్థాయిలో లేదు. తాజాగా ఆగ్రాలో జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో కేంద్ర పర్యాటక శాఖ హాట్ ఎయిర్ బెలూన్ సఫారీని ప్రవేశపెట్టింది. ఆగ్రానగర అందాలతోపాటు తాజ్‌మహల్‌ను విహంగవీక్షణం చేసేందుకు వీలుగా ఎయిర్ బెలూన్ సఫారీని పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రతియేటా నిర్వహించే తాజ్ మహోత్సవ్‌లో...ఈసారి హాట్ ఎయిర్ బెలూన్ సఫారీని ప్రవేశపెట్టారు. పర్యాటకాభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ సరికొత్త వినోదాన్ని జోడించింది. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆరుగురు ప్రయాణించే వీలుంటుందని...స్కైవాట్జ్ సంస్థ చీఫ్ చౌహాన్ తెలిపారు. బెలూన్‌లో ఆగ్రా నగరంతోపాటు తాజ్‌మహల్‌ను విహంగవీక్షణం చేయవచ్చని చెప్పారు. ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. తమ సంస్థకు విమానయాన నియంత్రణ సంస్థ-DGCA, కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతి ఉందని చౌహాన్ పేర్కొన్నారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో 5వేల అడుగుల ఎత్తుకు వెళ్లవచ్చని తెలిపారు. అయితే ఆగ్రా నగరం రక్షణ శాఖ జోన్‌లో ఉన్నందున హాట్ ఎయిర్ బెలూన్‌కు 2 వేల అడుగుల ఎత్తు వరకే అనుమతి ఉందని చెప్పారు. ఇందులో ప్రయాణించాలంటే ఒక్కొక్కరు 13వేల రూపాయలతోపాటు పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ 45 నిమిషాలు ఉంటుందని చౌహాన్ పేర్కొన్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో ఇలాంటి వినూత్నమైన వినోదాన్ని పంచే వాటిని ప్రవేశపెడితే సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని తాజ్ మహోత్సవ్‌కు హాజరైన ఓ పర్యాటకుడు తెలిపాడు. హాట్ ఎయిర్ బెలూన్ సఫారీలో ప్రయాణం అద్భుతమని చెప్పాడు. ప్రస్తుతం హాట్ ఎయిర్ బెలూన్ సఫారీకి ఆదరణ అంతగా లేకున్నా... భవిష్యత్తులో పెరుగుతుందని వ్యాఖ్యానించాడు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం...తాజ్ మహోత్సవ్‌ను ప్రతి ఏడాది సరికొత్తగా నిర్వహించటంపై... సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com