Delhi: పోలీసుల పహారాలో గ్యాంగ్‌స్టర్ల వివాహం

Delhi: పోలీసుల పహారాలో గ్యాంగ్‌స్టర్ల వివాహం
మెటల్‌ డిటెక్టర్లు, డ్రోన్లతో సెక్యూరిటీ- పెళ్లి కోసం 6గంటల పెరోల్

వారిద్దరూ కరుడుగట్టిన నేరాలు చేసిన గ్యాంగ్‌స్టర్లు. పెళ్లి చేసుకోవాలని భావించిన వారిద్దరికీ పోలీసులే బుల్లెట్‌ ప్రూఫ్‌ కల్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. భద్రతకు ఏ మాత్రం లోటు లేకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లను రంగంలోకి దించారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్యాంగ్‌స్టర్ల జంట వివాహం చేసుకుంది. హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరి అలియాస్‌ మేడమ్‌ మింజ్‌ పెళ్లి.. దిల్లీలోని ద్వారకా సెక్టార్‌-3లో ఉన్న సంతోష్‌గార్డెన్‌లో జరిగింది. ఆ పరిసర ప్రాంతమంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సందీప్‌ గతంలో ఓసారి హరియాణా పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్‌ ప్రవేశమార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు మొదలు.. లోనికి వచ్చే వారికి బార్‌కోడ్‌ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించారు. 250 మందికి పైగా దిల్లీ పోలీసుల పహారా మధ్య వారి పెళ్లి జరిగింది. సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ తరఫు న్యాయవాది 51 వేల రూపాయలు చెల్లించి కళ్యాణ మండపాన్ని బుక్‌ చేయించారు.

అనురాధ అలియాస్‌ మేడమ్ మింజ్ అలియాస్ రివాల్వర్‌ రాణి, సందీప్‌ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ పలు కేసుల్లో నిందితులు. సందీప్‌.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. అతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి డజనుకు పైగా కేసులున్నాయి. అనురాధ..గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌ సింగ్ వద్ద పని చేసింది. మనీ లాండరింగ్, కిడ్నాప్‌, బెదిరింపులు వంటి పలు కేసుల్ని ఎదుర్కొంటోంది. 2020లో పరారైన వీరు పోలీసుల్ని తప్పించుకొని పలు రాష్ట్రాలకు మకాం మార్చారు. చివరకు 2021 జులైలో పోలీసులకు చిక్కారు. కొంతకాలం తర్వాత ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ పెళ్లి కోసం కోర్టు అతడికి ఆరు గంటలపాటు పెరోల్‌ను మంజూరు చేసింది

Tags

Read MoreRead Less
Next Story