తమిళనాడులో అమూల్‌ పాలసేకరణ ఆపాలన్న సీఎం స్టాలిన్

తమిళనాడులో అమూల్‌ పాలసేకరణ ఆపాలన్న సీఎం స్టాలిన్
X
అమూల్‌ను కట్టడి చేయాలని.. తమ రాష్ట్రంలో పాల సేకరణ జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

తమిళనాడులో అమూల్‌ పాలసేకరణపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏపీ, కర్నాటక తరువాత తమిళనాడులో పాల సేకరణ చేపట్టిన అమూల్‌ సంస్థపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్‌ చర్య దేశంలోని సహకార వ్యవస్థకు విఘాతం కల్గిస్తోందని ఆయన ఆరోపించారు. అమూల్‌ను కట్టడి చేయాలని.. తమ రాష్ట్రంలో పాల సేకరణ జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

అమూల్‌కు మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ లైసెన్స్‌ ఉన్న మాట నిజమేనని.. అయితే ఇతర రాష్ట్రాల్లోని సహకార సంఘాలను విధ్వంసం చేసేందుకు దీన్ని ఉపయోగించడం దారుణమని స్టాలిన్‌ ఫైర్‌ అయ్యారు. తమ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అమూల్‌ తన ఉత్పత్తులను అమ్ముతోందని...దానిపై తాము ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అయితే తమ సహకార సంస్థ ఆవిన్‌ పరిధిలోని ప్రాంతాల్లో పాలసేకరణను ప్రారంభించడం సరికాదని ఆయన అన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్‌ సెంటర్లను, ప్రాసెసింగ్‌ ప్లాంటును అమూల్‌ ప్రారంభించిందని ఆయన అన్నారు. ఈ ప్లాంట్ల కోసం కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, , తిరుపత్తూర్‌, కాంచీపురం, తిరువళ్ళూవారు, ఇతర జిల్లాల నుంచి అమూల్‌ పాలను సేకరిస్తోందని ఆయన విమర్శించారు.

మరోవైపు ప్రతి రాష్ట్రంలో స్థానిక సహకార సంఘాలు పటిష్ఠంగా పనిచేస్తున్నాయని,అయితే అమూల్‌ ప్రవేశంతో అనారోగ్య పోటీకి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. తమ రాష్ట్రంలో రోజూ నాలుగున్నర లక్షల మంది సభ్యల నుంచి రోజూ 35 లక్షల లీటర్ల పాలను పాల ఉత్పత్తి సహకార సంస్థలు సేకరిస్తున్నాయని స్టాలిన్‌ తెలిపారు. తమ సహకార సంస్థలు అన్నీ కలిసి రాష్ట్ర స్థాయిలో ఆవిన్‌ పనిచేస్తోందని ఆయన అన్నారు. పాల సేకరణతో పాటు ఇతర అంశాల్లో కూడా ఆవిన్‌... పాడి రైతులకు అండగా ఉంటోందని ఆయన అన్నారు.తమ రాష్ట్రంలో ఆరోగ్యకరంగా ఉన్న పాల సహకార సంఘాలు..అమూల్‌ నుంచి అనారోగ్య పోటీని ఎదుర్కోవల్సి ఉంటుదని స్టాలిన్‌ అన్నారు.

Tags

Next Story