తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్‌ మంత్రి అరెస్ట్‌

తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్‌ మంత్రి అరెస్ట్‌
మనీలాండరింగ్‌ కేసులో సోదాలు, 24 గంటల్లో అరెస్ట్

తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్‌ శాఖల మంత్రి వి. సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో అతనిని బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. అయితే అరెస్ట్ సమయంలో మంత్రి కుప్పకూలిపోవడంతో ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసంలో 18 గంటలపాటు విచారించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అరెస్ట్ చేసేటప్పుడే మంత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పగా అతనిని ఆసుపత్రి కి తరలించారు. అయితే ఆసుపత్రి వెలుపల సైతం మద్దతు దారిలో భారీ ఎత్తున గుమ్మిగూడారు.

ఓ వైపు వారు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, వాహనంలో మంత్రి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఎం సుబ్రమణియన్, ఈవీ వేలు ఆసుపత్రిని సందర్శించారు. సెంథిల్ బాలాజీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఐసీయూలో ఉన్నారని తెలిపారు. తమని రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి స్థాలిన్ మండిపడ్డారు. వీటికి తాము భయపడేది లేదన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కోసం సీనియర్ మంత్రులు, లీగల్ టీం తో సమావేశమాయ్యారు.

గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లుగా ఉన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం కేంద్ర పారా మిలటరీ బలగాలు, భద్రతల నడుమ బాలాజీ, ఆయన సోదరుని ఇళ్ళు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం మంత్రి సెంథిల్‌ బాలాజీని ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖల కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు వారం రోజుల పాటు సాగాయి .చైన్నె, కోయంబత్తూరు,కరూర్‌, ఈరోడ్‌లలోని 40 చోట్ల నాలుగైదు రోజులు సోదాలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story