NEET : నీట్‌కు వ్యతిరేకంగా.. సంతకాల ప్రచారం ప్రారంభించిన డీఎంకే

NEET : నీట్‌కు వ్యతిరేకంగా.. సంతకాల ప్రచారం ప్రారంభించిన డీఎంకే
సంతకాల సేకరణ కార్యక్రమం లో నీట్‌’ గుడ్డును చూపించిన ఉదయనిధి స్టాలిన్‌.

దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది.

నీట్‌ పరీక్ష రాసి అర్హత సాధించని సుమారు 22 మంది తమిళ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఇది ఉందని విమర్శించింది. నీట్ పరీక్షను బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ.. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసనలు తెలుపుతున్నారు. నీట్ సామాజిక విరుద్ధమని, ఇది పట్టణ విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే అవకాశం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉందని డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. గతంలో డీఎంకే పార్టీ నీట్ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేసింది.


పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ఈ సిగ్నేచర్ క్యాంపెన్ ప్రారంభించింది. ఈ సంతకాల పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ పదానికి సున్నా అన్న అర్థం అక్కడ వాడుకలో ఉంది. ఈ నేపథ్యంలో నీట్‌ పీజీ కటాఫ్‌ను జీరో పర్సంటైల్‌కి కేంద్రం తగ్గించిన విషయాన్ని ఈ విధంగా ఆయన గుర్తు చేశారు.

నీట్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) వరకు ఫాసిస్టులు మా విద్యాహక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నారు, మేము వారిపై నిరంతరం పోరాడుతాము, నీట్ నిషేధించాలన్న మా డిమాండును వ్యతిరేకిస్తే జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి ఉదయనిధి హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఈ ఉద్యంలో పాల్గొనాలని ఆయన కోరారు.



Tags

Read MoreRead Less
Next Story