ED Officer: తమిళనాడులో ఈడీ అధికారి అరెస్టు

ED Officer: తమిళనాడులో ఈడీ అధికారి అరెస్టు
ప్రభుత్వ అధికారి నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ...

ప్రభుత్వ అధికారి వద్ద లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు తమిళనాడులో అంకిత్‌ తివారీ అనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీనియర్‌ అధికారి. తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిందీ ఘటన. అక్టోబరు 29న దిండిగల్ జిల్లా విజిలెన్స్, అవినీతి నిరోధక (డీవీఏసీ) విభాగం ఉద్యోగిని అంటూ ఓ వ్యక్తికి అంకిత్ ఫోన్ చేశాడు. ఆయనపై గతంలో నమోదై, ముగిసిన కేసును దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని అక్టోబరు 30న మధురైలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని కోరాడు.

నిజమేనని నమ్మిన ఉద్యోగి 30న ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. రూ. 3 కోట్లు ఇస్తే కేసును క్లోజ్ చేస్తానని అక్కడ తివారీ అతడితో బేరం పెట్టాడు. ఆ తర్వాత రూ. 51 లక్షలు ఇస్తే సరిపోతుందని, ఉన్నతాధికారులు కూడా అందుకు సరేనన్నారని చెప్పుకొచ్చాడు. అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 1న తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 20 లక్షలు అందించాడు. ఆ తర్వాత మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని పై అధికారులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, కాబట్టి తొందరగా ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అంకిత్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 30న డీవీసీఏకు ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా ఆయన నుంచి ఓ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని, ఆయన ఈడీ అధికారిగా పనిచేస్తున్నట్టు ఆ ఐడీకార్డులో ఉన్నదని వివరించింది. అంకిత్‌ తివారీతోపాటు ఆయన బృందానికి చెందిన ఈడీ అధికారులు కేసుల మాఫీ పేరుతో అనేక మంది ప్రజలను బెదిరించి లంచాలను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత డీవీసీఏ అధికారులు మధురైలోని ఈడీ కార్యాలయంతోపాటు నిందితుడు అంకిత్ తివారీ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ ముఠా ఇలా ఎంతోమందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మధురై, చెన్నైకి చెందిన పలువురి ఈడీ అధికారుల హస్తం కూడా దీనివెనక ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. తమిళనాడులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న తరుణంలో ఈ అరెస్టు జరగడం గమనార్హం. ఇసుక మైనింగ్‌ కేసులో ఇటీవల తమిళనాడులోని ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీచేసిన సమన్లపై కొద్ది రోజుల క్రితం మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది.

Tags

Next Story