Tamilanadu: వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తూ కుప్పకూలి మహిళ మృతి..

నిరంతరాయంగా కొట్టుకునే గుండె ఎప్పుడు ఆగుతుందో ఎవరూ చెప్పలేరు. అనారోగ్య సమస్యలూ ఉండక్కర్లేదు, అంత పెద్ద వయసూ ఉండక్కర్లేదు.. ఉన్నట్టుండి సడెన్ గా ఆగిపోతుంది. అప్పుటి వరకు కళ్లముందు ఉన్నవారు కనబడకుండా పోతారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురంలో మంగళవారం రాత్రి వివాహ రిసెప్షన్‌లో నృత్యం చేస్తూ ఒక మహిళ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
కాంచీపురం నివాసితులు జీవా మరియు ఆమె భర్త జ్ఞానం తమ స్నేహితుడి కొడుకు వివాహానికి వెళ్లారు. వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్‌మురుగన్ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు పెళ్లివాళ్లు. ప్రదర్శన సమయంలో, వెల్మురుగన్ ప్రేక్షకులను తనతో కలిసి వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించాడు. జీవా కూడా వేదికపైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. ఆమె నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దాంతో వేదికపై ఉన్నవారు అమెకు ప్రథమ చికిత్స అందించారు. కానీ ఆమె స్పృహలోకి రాలేదు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు.
కుప్పకూలిపోయే ముందు జీవా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిబ్రవరి 2025లో జరిగిన ఇలాంటి సంఘటనలోనే, తమిళనాడుకు చెందిన 53 ఏళ్ల రాజేష్ కన్నన్ తన బృందంతో ప్రదర్శన ఇస్తుండగా అకస్మాత్తుగా వేదికపై పడిపోయాడు. నిర్వాహకులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com