Tamilisai: మాజీ గవర్నర్ తమిళిసైకి పితృ వియోగం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కుమారి అనంతన్ (93) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున చెన్నైలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో అనంతన్ ప్రాణాలు వదిలారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అనంతన్.. 1977లో నాగర్‌కోయిల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. తమిళ రచయితగా, ప్రముఖ వక్తగా, రాజకీయ నేతగా ఎనలేని ముద్రవేసుకున్నారు. 1933 మార్చి 19న కన్యాకుమారి జిల్లా కుమారిమంగళంలో జన్మించిన అనంతన్‌కు తమిళం అంటే ఎనలేని ప్రేమ. తండ్రిని బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. అనంతన్ సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం 2024లో రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన తగైసల్ తమిజార్ అవార్డుతో సత్కరించింది. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కామరాజర్ అవార్డును ప్రదానం చేసింది.
కుమారి అనంతన్ మరణవార్తకు సంబంధించిన అంశాన్ని తమిళిసై తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. పార్లమెంట్‌లో తమిళంలో మాట్లాడిన తొలి వ్యక్తి తన తండ్రి అని ఆమె పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com