Ayodhya: అయోధ్య రోడ్‌షోలో హింసకు పాల్పడండి..

Ayodhya: అయోధ్య రోడ్‌షోలో హింసకు పాల్పడండి..
ముస్లింలను రెచ్చగొట్టిన ఖలిస్థానీ ఉగ్రవాది

ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్నూతాజాగా మరో వీడియొ విడుదల చేశారు. ఈ నెల 30 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ రోడ్‌ షోలో హింసకు పాల్పడాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో నివసిస్తున్న ముస్లింలకు గురు పత్వంత్ సింగ్ పన్ను రెచ్చగొట్ట వ్యాఖ్యలతో ఉన్న వీడియోను విడుదల చేశాడు. అయోధ్యలో ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేందుకు శనివారం అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. అక్కడే రోడ్ షో నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను విడుదల చేసిన వీడియోతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. విదేశీ గడ్డపై నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన గురు పత్వంత్ సింగ్ పన్ను.. తాజాగా భారత్‌లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయోధ్యలో ఈనెల 30 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న రోడ్ షో లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు పాల్పడాలని యూపీ ముస్లింలకు గురు పత్వంత్ సింగ్ పన్ను పిలుపునిచ్చాడు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విడుదల కావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి.

శనివారం ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం, అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించి.. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు.. ఎన్‌హెచ్-27, ధరమ్ పాత్, లతా మంగేష్కర్ చౌక్, రామ్ పథ్, తేదీ బజార్ మీదుగా అయోధ్య రైల్వే స్టేషన్‌ వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా ప్రధాని మోదీ రోడ్ షో సాగనుంది.


కేవలం హింసను మాత్రమే సృష్టించకుండా ముస్లింల కోసం కొత్త దేశం ‘ఉర్దుస్తాన్’ కావాలని డిమాండ్ చేయాలని పత్వంత్ సింగ్ పన్నూ సూచించాడు. త్వరలో భారత్‌లో నమాజ్‌ను కూడా నిషేధిస్తారని.. ముస్లింలను రెచ్చగొట్టేలా సంచలన ఆరోపణలు చేశాడు. అటు.. అయోధ్యలో దివ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ముస్లింలను రెచ్చగొట్టేలా గురు పత్వంత్ సింగ్ పన్ను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న పక్కా సమాచారంతో గురు పత్వంత్ సింగ్ పన్నూ పేరును 2020లో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. గతంలో కూడా భారత్‌లో అనేకసార్లు దాడి చేస్తానని గురు పత్వంత్ బెదిరింపులకు దిగాడు. గత వారం కూడా కాశ్మీర్ - ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ ప్రతినిధిగా తనను తాను పన్ను అభివర్ణించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఇటీవల భారత సైనికులపై దాడికి కూడా మద్దతు తెలిపాడు. ఈ దాడి కాశ్మీరీలపై భారతదేశం చేస్తున్న హింసాకాండ ఫలితమని పేర్కొన్నాడు. కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా అభివర్ణించిన గురుపత్వంత్ సింగ్ పన్ను.. దానికి పరిష్కారం రెఫరెండం మాత్రమేనని చెప్పాడు.


Tags

Read MoreRead Less
Next Story