Bangladesh: ఉద్రిక్తతల వేళ 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహమాన్ రాక..

బంగ్లాదేశ్ రాజకీయ వేదికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అగ్రనేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చారు. లండన్‌లో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తల్లి ఖలీదా జియా అనారోగ్యం, అలాగే దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తారిక్ రహమాన్ రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాయి. విమానాశ్రయం పరిసర ప్రాంతాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు.
తారిక్ స్వదేశానికి రావడంతో బీఎన్పీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంద. “ఇది తారిక్ రహమాన్‌కు సెకండ్ ఇన్నింగ్స్” అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వేలాదిగా పార్టీ మద్దతుదారులు ఢాకా ఎయిర్‌పోర్ట్ వరకు మార్చ్ నిర్వహించారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఢాకా వీధులు హోరెత్తాయి.
మాజీ ప్రధాని ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కుమారుడు తారిక్ స్వదేశానికి రావడం భావోద్వేగపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ రాకకు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతున్నాయి.
స్వదేశానికి చేరుకున్న తారిక్ రహమాన్.. మధ్యాహ్నం మూడు గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు బీఎన్పీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రసంగంలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై కీలక సంకేతాలు ఇవ్వనున్నారన్న అంచనాలు ఉన్నాయి. తారిక్ రహమాన్‌ను ఆయన ప్రత్యర్థులు గతంలో ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించేవారు. అవినీతి ఆరోపణలు, రాజకీయ వివాదాల కారణంగా ఆయన పేరు చర్చల్లో నిలిచింది. అయితే, ఇప్పుడు రాజకీయంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని బీఎన్సీ నేతలు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

