Indian Fighter Jets: సైన్యానికి బిగ్ బూస్ట్ .. భారత్ తేజస్ MK-2 ప్రత్యేకటలివే

తేజస్ ఫైటర్ జెట్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ముందు వరుసలో నిలిచే విమానం. ఇప్పటికే భారతదేశం తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక రకాల యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. తేజస్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి HAL విశేష కృషి చేస్తోంది. తేజస్ జెట్‌లో అనేక రకాల సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. ఇది ప్రస్తుత అధునాతన విమానాల కంటే చాలా ఎక్కువ ప్రాణాంతక సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. తేజస్ కొత్త రకం యుద్ధ విమానం ముందు పాకిస్థాన్ F-16 చాలా వెనుకబడి ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికన్ F-16 కంటే మన తేజస్ కొత్త వెర్షన్ చాలా శక్తివంతమైనదిగా ఉండనుంది. తేజస్ ఫైటర్ జెట్ 4.5-తరం ఫైటర్ జెట్, కానీ దాని కొన్ని లక్షణాలు ఐదవ తరం జెట్‌ను పోలి ఉంటాయని చెబుతున్నారు. ఇక తేజస్ కన్ను పడిన చోట బుడిద కావాల్సిందే అని అంటున్నారు.
5వ తరం జెట్ అభివృద్ధికి మొదలైన ప్రాజెక్టు..
భారతదేశం ఇప్పటికే తేజస్ ఐదవ తరం జెట్‌ను అభివృద్ధి చేయడానికి AMCA ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా నిరంతరం తన ఫైటర్ జెట్‌లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారత్ దేశ రక్షణ వ్యవస్థదాన్ని బలోపేతం చేయడంలో బిజీగా ఉంది. స్వదేశీ తేజస్ యుద్ధ విమాన కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తేజస్ Mk-2 (MWF – మీడియం వెయిట్ ఫైటర్) గురించి రక్షణ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. దీని మొదటి నమూనా 2025 చివరి నాటికి సిద్ధంగా ఉండవచ్చని, మొదటి విమానం 2026 ప్రారంభంలో కానున్నట్లు సమాచారం. ఉత్పత్తి 2029లో ప్రారంభమవుతుంది, 2032 నుంచి ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి డెలివరీకి అవుతాయని అంచనా. 2034 నాటికి 120 యూనిట్లను వైమానిక దళంలో చేర్చడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. GE ఇంజిన్ సరఫరా, స్వయం సమృద్ధి జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజిన్ సరఫరా భారతదేశానికి చాలా కీలకంగా మారింది. స్థానిక ఇంజిన్ ఉత్పత్తికి సంబంధించి HAL, GE ఏరోస్పేస్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని ఇటీవలి నివేదికలు వచ్చాయి. ఈ ఒప్పందం మంచి ఫలితాలు ఇస్తే, భారతదేశం ఉత్పత్తి గడువులను చేరుకోవడమే కాకుండా, దిగుమతిపై ఆధారపడటాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మామూలుగా లేవు కదా తేజస్ MK-2 ప్రత్యేకతలు..
Mk-2 ఎయిర్‌ఫ్రేమ్ Mk-1ల కంటే పెద్దదిగా ఉండటంతో పాటు, దగ్గరగా జతచేసిన కానార్డ్‌లను కలిగి ఉంటుంది. దీని ద్వారా దాని పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమెరికన్ జనరల్ ఎలక్ట్రిక్ F-414 ఇంజిన్ ద్వారా శక్తిని పొందనుంది. ఈ ఇంజిన్ తేజస్ ఫైటర్‌కు ఎక్కువ వేగం, పేలోడ్ సామర్థ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు. స్వదేశీ ఏవియానిక్స్, అధునాతన AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు ఈ ఫైటర్ జెట్‌ను అత్యాధునికంగా చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ యుద్ధ విమానం తయారీలో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 82% కంటే ఎక్కువ స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తుందని, అది క్రమంగా 90% కంటే ఎక్కువ పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇంజిన్ ఉత్పత్తి లైసెన్స్ పొందిన తర్వాత ఈ లక్ష్యం మరింత పెరగనున్నట్లు సమాచారం.
తేజస్ Mk-1A వెర్షన్ ఇప్పటికే ఉత్పత్తిలో ఉంది. ఇది Mk-1 కంటే మెరుగైనది. ఈ యుద్ధ విమానం ఆధునిక ఏవియానిక్స్, స్వదేశీ రాడార్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ యుద్ధ విమానం వైమానిక దళం సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తేజస్‌కు ఒక ప్రధాన హైలైట్ మెటిలియర్ BVRAAM (బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్) ఏకీకరణ అని అంటున్నారు. ఈ క్షిపణి తేజస్‌కు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అందజేయనుంది. దీని వేగం, సుదూర పరిధి నో-ఎస్కేప్ జోన్‌తో ఈ క్షిపణి తేజస్ Mk-1A, Mk-2 రెండింటికీ గేమ్-ఛేంజర్‌గా మారబోతుందనడంలో సందేహం లేదంటున్నారు. దీని రాకతో భారత వైమానిక దళం ఆధిపత్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com