ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలకు పదిరోజుల సమయం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు తాము అడిగిన విధంగా సమగ్రంగా సమర్పించాలని హైకోర్టులకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారచేసింది. ఒక తాత్కాలిక నమూనా పట్టిక తయారుచేసి పంపుతున్నామని, అందులో ప్రతి వివరాన్నీ తప్పనిసరిగా నింపి పంపాలని స్పష్టంచేసింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధలతో కూడిన ధర్మాసనం తాజా ఉత్తర్వులిచ్చింది.
ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ.... భాజపా నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది. ముందుగా న్యాయస్థాన సహాయకుడు విజయ్ హన్సారియా... దేశంలోని హైకోర్టులు పంపిన సమాచార వివరాలు చదివి వినిపించారు. ఇక సమాచారాన్ని క్రోడీకరిస్తున్నందు వల్ల కేసుల వివరాలు సమర్పించడానికి మరికొంత సమయం కావాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
కోర్టు గత ఉత్తర్వులకు అనుగుణంగా వివిధ హైకోర్టులు పంపిన సమాచారాన్ని అఫిడవిట్ సమర్పించినట్లు అమికస్ క్యూరీ చెప్పారు. కోర్టులు, కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన రీతిలో వివరాలు పంపలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని... కేసుల సత్వర విచారణకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కావాలని హైకోర్టులు అడుగుతున్నందున.... దానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత కరోనా సమయంలో ఆదాయం పడిపోయి రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున కేంద్రమే సానుకూల వైఖరి కనపరచాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఇక ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులు, అవసరమైన మౌలిక వసతుల వివరాలను సూటిగా నింపి పంపాలని.... దాని ఆధారంగా రాష్ట్రాల వారీగా సమస్యలపై స్పష్టత వస్తుందని జస్టిస్ రమణ బెంచ్ సూచించింది. కేసుల్లో నిర్దిష్ట కాలపరిమితితో సమన్లు జారీచేసేలా అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని సొలిసిటర్ జనరల్ మెహతా కోరారు. నేతలపై కేసుల వివరాలు విభిన్న మార్గాల నుంచి రావాల్సి ఉన్నందున, 10 రోజుల సమయం ఇవ్వాలని కోరడంతో.... విచారణను రెండు వారాలకు వాయిదావేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com