Terror Threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం..

జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి. ఈ జైళ్లలో ప్రస్తుతం అనేక మంది హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు.. వీరు దాడులలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు వీరు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక, సీఐఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆదివారం నాడు శ్రీనగర్‌లోని భద్రతా గ్రిడ్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. జైళ్ల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వారం రోజుల తర్వాత ఉగ్రవాదులు ఇప్పటికీ దక్షిణ కాశ్మీర్‌లో దాక్కుని ఉండవచ్చని NIA వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. కాగా, ఇప్పటికే ఉగ్రవాద సహచరులైన నిసార్, ముష్తాక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించగా.. వీరికి ఆర్మీ వాహనంపై దాడి కేసుతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తేలింది. ఇక, ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడితో భారత భద్రతా దళాలు అలర్ట్ కావడంతో.. మిగిలిన ఉగ్రవాదులు దాడులకు విరామం ఇచ్చారనే అనుమానాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com