Terro Attack in J and K: జమ్మూకశ్మీర్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ‘ఉగ్ర’దాడి!
జమ్మూకశ్మీర్‌లో శనివారం ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఒక ఎయిర్‌ఫోర్స్ సైనికుడు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. శనివారం సాయంతం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్‌వాల నుంచీ ఎయిర్ స్టేషన్‌కు తిరిగెళుతుండగా పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అందరికీ ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, ఘటన అనంతరం ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు ఘటన స్థలంలో ఉగ్రవాద ఏరివేత చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రియ రైఫిల్స్ కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటోంది. ఘటనపై స్పందించిన ఎయిర్‌ఫోర్సు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. దాడి అనంతరం టెర్రరిస్టులు సమీప అడవిలోకి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని రహదారులలో బలగాలను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన వైమానిక దళ జవానుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. ఈ దాడిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఖండించారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మా వైమానిక దళం కాన్వాయ్‌పై జరిగిన పిరికిపంద దాడి చాలా సిగ్గుచేటు, ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన సైనికుడికి మా నివాళులు అని ప్రకటించారు.
మరోవైపు, గతేడాది డిసెంబర్ 21న పూంచ్ జిల్లాలోని బుఫ్లియాజ్ ప్రాంతంలో ఆకస్మిక దాడికి తెగబడ్డ బృందమే ఈ దాడిలోనూ పాలుపంచుకుని ఉంటుందని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఆర్మీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com