Jammu Kashmir Encounter : ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం.. అమరులైన ముగ్గురు జవానులు..

Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని పార్గల్‌లో గల ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్‌ను దాటి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. క్యాంప్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పన్నాగం పన్నారు.
వీరిని గుర్తించిన ఆర్మీ సెంట్రీ వెంటనే కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
ఆరు నెలలుగా రాజౌరీ ప్రాంతంలోనూ వరుస ఉగ్రదాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన వెనుక లష్కరే తోయిబా ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంద్రాగస్టు వేళ ముష్కరులు దేశవ్యాప్తంగా భారీ దాడులకు ప్రయత్నించే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు
అటు బుధవారం పుల్వామా జిల్లాలో ఓరోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బడ్‌గామ్ జిల్లాలోనూ భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com