Pahalgam Attack: దాడికి కొన్నిరోజుల ముందే నాలుగుచోట్ల రెక్కీ నిర్వహించి..

Pahalgam Attack: దాడికి కొన్నిరోజుల ముందే  నాలుగుచోట్ల రెక్కీ నిర్వహించి..
X
పెహల్‌గామ్‌ దాడిలో వెలుగులోకి కీలక విషయాలు

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముష్కరులు కొన్ని రోజుల ముందే పెహల్‌గామ్‌ వచ్చి నాలుగు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. పక్కా ప్రణాళికతోనే బైసరాన్‌ వ్యాలీ లో నరమేధం సృష్టించినట్లు అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు.

గత నెల 22న పెహల్‌గామ్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ నరమేధంలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన అనంతరం కశ్మీర్‌ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులకు క్షేత్ర స్థాయిలో సహకరించిన ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఉగ్రవాదులు ఏప్రిల్‌ 15వ తేదీనే పెహల్‌గామ్‌కు వచ్చినట్లు అరెస్టైన వారిలో ఒకరు చెప్పినట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారు నాలుగు చోట్ల రెక్కీలు నిర్వహించినట్లు చెప్పారు. బైసరాన్‌ వ్యాలీ, అరు వ్యాలీ, అమ్యూస్‌మెంట్‌ పార్క్‌, బేతాబ్‌ వ్యాలీలను సందర్శించి రెక్కీ నిర్వహించారు. అయితే అరు వ్యాలీ, అమ్యూస్‌మెంట్‌ పార్క్‌, బేతాబ్‌ వ్యాలీలో భద్రతా ఏర్పాట్లు ఉండటంతో వారు దాడులు చేయడానికి వెనుకంజ వేశారు. బైసరాన్‌ వ్యాలీలో భద్రత లేకపోవడంతో తమ దాడికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నారు. అక్కడ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు.

Tags

Next Story