Rajasthan: కిడ్నాపర్‌ను వదిలి రాని బాలుడు

చిన్న పిల్లల ప్రేమ నిష్కల్మషమైనది. తమకు దగ్గరైన వారు మంచి వారు, చెడ్డవారా అనేది వారికి అనవసరం. రాజస్థాన్ లోని జైపూర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. 14 నెలల క్రితం తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని వదలడానికి రెండేళ్ల బాలుడుఇష్టపడలేదు. ఆ కిడ్నాపర్‌ను వదిలి తల్లి దగ్గరకు వెళ్లడం ఆ చిన్నారి మనసుకు ఎంతో కష్టం కలిగించింది. ఆ కిడ్నాపర్ కూడా ఆ బాలుడు వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. యూపీలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సస్పెండైన తనుజ్ చాహర్ గత ఏడాది జూన్‌లో 11 నెలల పిల్లాడిని కిడ్నాప్ చేసి ఇంటికి తెచ్చాడు. బాలుడి తల్లి తనతో రావడానికి ఇష్టపడకపోవడంతో తనూజ్ ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డాడు. కిడ్నాప్ తర్వాత సస్పెన్షన్‌కు గురయ్యాడు. తనూజ్ యూపీ పోలీసు విభాగంలో స్పెషల్ ఫోర్స్, నిఘా టీమ్స్‌లో కూడా పని చేసినందు వల్ల పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ప్లాన్‌లు వేశాడు. మొబైల్ ఫోన్ వాడలేదు. తరచూ తన స్థానాలు మార్చేవాడు. గడ్డం, తల బాగా పెంచాడు. చివరకు సన్యాసిగా మారిపోయి బృందావన్‌లోని పరిక్రమ మార్గంలో యమునా నదికి సమీపంలోని ఖాదర్ ప్రాంతంలో ఓ గుడిసె వేసుకున్నాడు. ఎన్ని వేషాలు వేసినా తను కిడ్నాప్ చేసిన బాలుడు పృథ్విని మాత్రం కన్న కొడుకులా చూసుకున్నాడు. అతడ అలనా పాలనా చూసి గారాభంగా పెంచాడు. 14 నెలలుగా తనూజ్ కోసం గాలిస్తున్న జైపూర్ పోలీసులకు ఇటీవల అతడి ఆచూకీ దొరికింది. అతడిని వెంబడించి పట్టుకుని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పృథ్విని తల్లికి అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే పృథ్వి తనను కిడ్నాప్ చేసిన తనూజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు. కిడ్నాపర్ తనూజ్‌ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు. చివరకు ఓ పోలీసు అధికారి మరీ బలవంతంగా విడదీసి తల్లికి అప్పగించాడు. ఆ సమయంలో నిందితుడు తనూజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com