Cough syrups | రెండేండ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్ వినియోగం వద్దు.

చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గు సిరప్‌లు, జలుబు మందుల వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయిస్తోంది. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను పూర్తిగా నిషేధించే దిశగా చర్యలు చేపడుతోంది. ఐదేళ్లలోపు పిల్లలకు కూడా ఈ మందులను వైద్యుల సమగ్ర పరీక్ష లేకుండా ఇవ్వకూడదని సూచనలు రూపొందిస్తున్నారు. ఇటీవల నాసిరకం దగ్గు సిరప్‌ల వల్ల పలు దేశాల్లో చిన్నారుల మరణాలు సంభవించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ రూపొందించిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2026 ముసాయిదాలో ఈ నిబంధనలు చేర్చబడ్డాయి. దగ్గు సిరప్‌లలో డైఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశాలు ఉన్నందున తయారీ ప్రమాణాలను కఠినతరం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు నాణ్యమైన ముడి పదార్థాలు మాత్రమే వాడాలని, ప్రతి బ్యాచ్‌ను పరీక్షించి భద్రత నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.
వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే చిన్నపిల్లల్లో దగ్గు అనేది శరీర రక్షణ చర్య. దాన్ని పూర్తిగా అణచివేయడం కంటే కారణాన్ని గుర్తించడం ముఖ్యం. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే దగ్గు సాధారణంగా కొన్ని రోజుల్లో స్వయంగా తగ్గిపోతుంది. సిరప్‌ల వల్ల ఎక్కువ ప్రయోజనం లేకపోవడంతో పాటు నిద్రలేమి, అలసట, శ్వాస సమస్యలు వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యామ్నాయంగా పిల్లలకు తగినంత నీరు ఇవ్వడం, వేడి ఆవిరి పట్టించడం, సెలైన్ డ్రాప్స్ వాడటం, విశ్రాంతి ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు తేనె ఉపయోగపడుతుంది. మొత్తంగా, డాక్టర్ సలహా లేకుండా చిన్నపిల్లలకు మందులు ఇవ్వకపోవడం అత్యంత ముఖ్యమైన భద్రతా చర్యగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
