Hayli Gubbi Volcano: ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్... భారత్‌లో పలు విమానాలు రద్దు

ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో వెలువడిన బూడిద మేఘాలు ఉత్తర భారతంపైకి విస్తరించాయి. ఈ పరిణామంతో దేశంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 12,000 ఏళ్ల తర్వాత ఆదివారం బద్దలైంది. దీని నుంచి వెలువడిన దట్టమైన బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వైపు ప్రయాణించి, ప్రస్తుతం ఉత్తర అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి. ఈ బూడిద మేఘాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే, ఈ మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తులో ఉండటంతో ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా ఆకాశ ఎయిర్, ఇండిగో, కేఎల్‌ఎం వంటి విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ఈ నెల నిన్న, ఈరోజు జెడ్డా, కువైట్, అబుదాబికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ కూడా ఆమ్‌స్టర్‌డామ్-ఢిల్లీ రాకపోకల సర్వీసులను నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఇండిగో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.
బూడిద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ప్రయాణించాలని, తాజా సమాచారం ఆధారంగా రూటింగ్, ఇంధన ప్రణాళికలను మార్చుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. బూడిద మేఘాల కారణంగా ఇంజిన్ పనితీరులో తేడాలు, క్యాబిన్‌లో పొగ లేదా వాసన వంటివి గమనిస్తే తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. విమానాశ్రయాలపై బూడిద ప్రభావం పడితే రన్‌వేలు, ట్యాక్సీవేలను వెంటనే తనిఖీ చేయాలని ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లకు సూచించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

