Madras High Court: దేవాలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశంపై సంచలన తీర్పు

ఆలయాల్లోకి హిందూయేతర ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లోకి హిందూయేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదంటూ కీలక ప్రకటన చేసింది. హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంటూ ప్రతి దేవాలయం బయట బోర్డులను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ఈ మేరకు మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీచేయడం జరిగింది.
తమిళనాడులోని ప్రసిద్ధిచెందిన అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి కేవలం హిందువులకు మాత్రమే అనుమతించాలంటూ దానికోసం ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మధురై ధర్మాసనం హిందు ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశంపై అన్నిఆలయాల ప్రవేశ ద్వారాలలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో 'హిందూయేతరులను అనుమతించరు' అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక, ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా తమిళనాడు పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చడం జరిగింది. ఎందుకంటే, తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది.
‘హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంలేని ఇతర మతస్తులను ఆలయంలోకి అనుమతించ వద్దు.. ఒకవేళ హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంతో, భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ ఆలయ దర్శనం కోరే ఇతర మతస్తులను ఆమేరకు హామీపత్రం తీసుకుని అనుమతించ వచ్చు. అయితే, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటికి అనుగుణంగా దర్శనానికి వచ్చినపుడే లోపలికి అనుమతించాలి’ అంటూ జస్టిస్ ఎస్ శ్రీమతి ప్రభుత్వానికి సూచించింది.
‘‘బృహదీశ్వరాలయంలో ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఆలయ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్ గా భావించి ఆలయ ఆవరణలో మాంసాహారం తిన్నారని తెలిసింది. అదేవిధంగా, ఇటీవల, 11.01.2024 న, ఇతర మతానికి చెందిన వ్యక్తులు తమ పవిత్ర గ్రంథంతో మదురైలోని అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర ఆలయంలోకి ప్రవేశించారని, అక్కడ తమ ప్రార్థనలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఒక వార్తాపత్రిక నివేదించింది.’’ కాబట్టి ఈ ఘటనలు హిందువులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com