Supreme Court: ఖనిజాలపై పన్ను రాష్ట్రాలు విధించవచ్చు!
ఖనిజాలపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్రాల చట్టసభలకు ఉంటుందని, పార్లమెంటుకు ఈ అధికారం ఉండదని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. రాష్ర్టాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ర్టాల మధ్య వివాదంగా ఉన్న ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూద్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని మొదటి జాబితా 54వ ఎంట్రీ ప్రకారం ఖనిజాలపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం పార్లమెంటుకు ఉండదని ధర్మాసనం పేర్కొన్నది. అయితే, రెండో జాబితాలోని 50వ ఎంట్రీ ప్రకారం మాత్రం.. రాష్ర్టాలపై పరిమితులు, షరతులు, మార్గదర్శకాలతో పాటు నిషేధం కూడా విధించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొన్నది. ఖనిజాలపై ప్రాథమిక అధికారం కేంద్రానికి ఉంటుందని 1989లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
గనులు, ఖనిజాలపై రాష్ర్టాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. లీజు పొందిన వ్యక్తి ఖనిజాలపై హక్కులను అనుభవిస్తున్నందుకు ఒక ఒప్పందం ప్రకారం చెల్లించేదే రాయల్టీ అని పేర్కొన్నది. కాగా, గతానికి కూడా వర్తించేలా ఈ తీర్పు అమలయ్యేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖనిజాలు, గనులపై పన్నుల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను రాష్ర్టాలకు తిరిగి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్ని రాష్ర్టాలు కోరాయి. రాష్ర్టాల విజ్ఞప్తిని కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఇలా చేస్తే భారీ ప్రభావం పడుతుందని, ఇక నుంచి మాత్రమే తీర్పు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ విషయమై రాతపూర్వకంగా స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ర్టాలకు సూచిస్తూ జూలై 31 వరకు కోర్టు గడువిచ్చింది. కాగా, జస్టిస్ బీవై నాగరత్న మాత్రం మిగతా న్యాయమూర్తుల అభిప్రాయంతో విభేదించారు.
ఖనిజ వనరుల మీద వచ్చే ఆదాయంపై కేంద్రం, రాష్ర్టాల మధ్య 35 ఏండ్లుగా ఉన్న వివాదానికి సుప్రీంకోర్టు ఈ తీర్పుతో ముగింపు పలికింది. రాయల్టీని కూడా పన్ను కిందనే చూడాలని, మైన్స్, మినరల్స్ డెవెలప్‌మెంట్ ఆండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఖనిజాలపై పన్నులు విధించే అధికారం రాష్ట్ర చట్టసభలకు ఉండదని 1989లో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2004లో మాత్రం ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం.. రాయల్టీ అనేది పన్ను కాదని మరో తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com