UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు

మ్మడి పౌర స్మృతి బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా యూసీసీ బిల్లును రూపొందించారు. ఆ చట్టాలకు మతపరమైన అధికారాలు ఉండవు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల అంశంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కీలకం కానున్నది.
ఒకవేళ ఈ బిల్లు అసెంబ్లీలో పాసైతే అప్పుడు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. అయితే ఇదే చట్టాన్ని అమలు చేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, మధ్యప్రదేశ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో కూడా ఇలాంటి సివిల్ కోడ్ రూల్ చాన్నాళ్లుగా అమలులో ఉన్నది. బహుభార్యత్వాన్ని రద్దు చేసే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక లివిన్ రిలేషన్‌లో ఉన్న జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఆంక్షలు పెట్టనున్నారు.
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి..?
ఇండియాలో యూనిఫార్మ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది. అంటే.. నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి కూడా ఒకరకంగా ఇలాంటిదే! కానీ చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్థి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడం ఈ యూసీసీ.
రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com