Election Campaign: ఓటు జిహాదీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ అగ్ర నేత సల్మన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన ఓట్ జిహాద్ పిలుపు ప్రకంపనలు రేపుతోంది. అధికార భాజపా ప్రభుత్వాన్ని తప్పించేందుకు మైనార్టీలందరూ ఏకం కావాలని లేకుంటే మన ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని మరియా ఆలం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై.... భారతీయ జనతా పార్టీ భగ్గుమంది. జీహాదీల మద్దతుతోనే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి నావల్ కిశోర్ శాక్యను గెలిపించేందుకు సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్ర నేత సల్మాన్ ఖుర్షీద్‌కు మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓట్ జిహాద్‌కు పిలుపునిచ్చారు. భాజపా ప్రభుత్వాన్ని తప్పించేందుకుప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీ వర్గానికి ఓట్ జీహాద్ తప్పనిసరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాయమాగంజ్‌లో ఎన్నికల ర్యాలీలోసల్మాన్ ఖుర్షీద్ సమక్షంలోనే మరియా ఈ వ్యాఖ్యలు చేయడం. కలకలం రేపింది. ప్రస్తుతం మనమంతా చేతులు కలపాల్సిన సమయమని, లేకుంటే ఈ సంఘీ ప్రభుత్వం మన ఉనికినే తుడిచిపెట్టేస్తుందని మరియా ఆలం హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంఘీ ప్రభుత్వంగా పేర్కొన్న మరియా ఆలం.. వ్యూహాత్మకంగా... నిశ్శబ్దంగా ఓటు వేయాలని ముస్లింలను కోరారు. భాజపా అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్‌కు మద్దతు ఇస్తున్న ముస్లింలను సామాజిక బహిష్కరణ చేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లు అందరూ చెబుతున్నారని కానీ, మానవత్వానికి కూడా ముప్పు పొంచి ఉందని మరియా ఆలం వ్యాఖ్యానించారు. మానవత్వంపైనా దాడి జరుగుతోందని... దేశాన్ని, దేశ సౌందర్యాన్ని, మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలని భావిస్తే ఎవరివల్లా ప్రభావితం అవకుండా అత్యంత తెలివిగా ఓటు వేయాలని ఆ ప్రచారంలో మరియా ఆలం పిలుపు నిచ్చారు. ఓట్ జిహాద్‌పై మరియా ఆలం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
మరియా ఆలం ఓట్ జిహాద్ పిలుపుపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ప్రతిపక్ష పార్టీలు జిహాదీల మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మరియా ప్రకటనను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరింది. జిహాదీలను రక్షించడం నుంచి.. వారు ఇప్పుడు ఓట్ జిహాద్‌కు మారిపోయారని కమలం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజ్‌వాదీ పార్టీ ఇండి కూటమి మొత్తం జిహాదీలకు అండగా నిలిచాయని ఇప్పుడు వారు ఎన్నికల్లో కూడా జిహాద్‌ను చూస్తున్నారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఆరోపించారు. భాజపా నేత గౌరవ్ భాటియా కూడా మరియా వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.
సల్మాన్ ఖుర్షీద్, ఆయన మేనకోడలు మరియా ఆలం బహిరంగ సభలో మైనారిటీలు ఓటు జిహాద్ చేయాలంటూ ఇచ్చిన పిలుపుపైకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు వర్గాల మధ్య అంతరాన్ని పెంచే..ప్రయత్నం చేశారన్న అభియోగాలపై188, 295, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు SP వికాస్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరియా ఉల్లంఘించారని తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com