Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు - స్పష్టం చేసిన ఆప్ మంత్రి

Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు - స్పష్టం చేసిన  ఆప్ మంత్రి
ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్‌ ధృవీకరణ

కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు లోక్ సభ ఎన్నికల వరకేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసే అవకాశం ఉందని ఆప్ దిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ పునరుద్ఘాటించారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పూర్తి మద్దతు ఇండియా కూటమికేనని స్పష్టం చేశారు. ఇండియా కూటమి లోక్ సభ ఎన్నికలకు మాత్రమే పోటీచేసిందని...ఇందులో పలుపార్టీలు కలిసి పోరాడాయని...అందులో ఆప్ కూడా ఒకటి అన్నారు. ఇప్పటివరకైతే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొత్తు లేదని గోపాల్ రాయ్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ కార్యకర్తల్లో నిరాశ నెలకొందని, కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పార్టీ ఐక్యంగా పోరాడినట్లు చెప్పారు. కాంగ్రెస్ -ఆప్ పొత్తుతో భాజపా అభ్యర్థుల మెజార్టీ తగ్గిందని...గోపాల్ రాయ్ తెలిపారు

2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఢిల్లీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఆప్ శనివారం (జూన్ 8) ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, పార్టీ కార్యకర్తల సమావేశం జూన్ 13న జరగనుంది.

కాగా.. ఐదు రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, అస్సాంలోని 22 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. పంజాబ్‌లో ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Tags

Next Story