Prashant Kishor: కాంగ్రెస్‌ నేతలకు రుచించని పీకే సూచనలు, సలహాలు.. ఇదే కారణమా..?

Prashant Kishor: కాంగ్రెస్‌ నేతలకు రుచించని పీకే సూచనలు, సలహాలు.. ఇదే కారణమా..?
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. కాంగ్రెస్‌కు పెద్ద హ్యాండ్‌ ఇచ్చారు.

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. కాంగ్రెస్‌కు పెద్ద హ్యాండ్‌ ఇచ్చారు. నిన్నామొన్నటి వరకు పీకే కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే అన్న ప్రచారం జోరుగా జరిగింది. పీకే కూడా తన చేరికపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. పీకే చేరికతో అతని వ్యూహాలు వర్కవుటై రాబోయే కాలంలో తామే చక్రం తిప్పుతామన్న జోష్‌ కాంగ్రెస్‌లో కనబడింది. అందుకే పీకే సూచించిన సలహాలు, సూచనలు పాటించేందుకు కాంగ్రెస్ కూడా ముందుకు వచ్చింది.

అంతా క్రిస్టల్‌ క్లియర్‌ అనుకుంటున్న దశలోనే.. పీకే హస్తానికి ఝలక్‌ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన పీకే చేరిక ఇక లేదని తేలిపోయింది. పీకే ఈ సడెన్‌ డెసిషన్‌కు కారణం ఏమై ఉంటుంది? ఇన్నాళ్లు కలిసి పనిచేస్తానన్న పీకే ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారు? కాంగ్రెస్‌ షరతులే పీకే నిర్ణయానికి కారణమా? అన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్ టాఫిక్‌గా మారాయి. సోనియాతో వరుస భేటీల తర్వాత శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో పీకే పర్యటించారు.

ఈ పర్యటనతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో రెండు రోజుల పాటు పీకే జరిపిన సమావేశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్‌ సంస్థ టీఆర్‌ఎస్‌ కోసం యథాతథంగా పనిచేస్తుందని పీకే ప్రకటించారు. అదే జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని హస్తం పార్టీ నేతలు అభిప్రాయపడుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి మరే పార్టీకి సేవలు అందించరాదని పీకేకు షరతు విధించడంతో ఆయన ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌తో పని చేయలేనని పీకే తెగేసి చెప్పినట్లు సమాచారం. పీకే కాంగ్రెస్‌లో చేరకపోవడంపై మరో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ యాక్షన్‌ గ్రూప్‌లో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది.

అంతేగానీ సంస్థాగతంగా పీకే సూచించిన సంస్కరణలు చేయడానికి కాంగ్రెస్‌ పెద్దగా ఆసక్తి చూపలేదన్న టాక్‌ వినిపిస్తోంది. తనను కరిపేపాకులా వాడుకుని పడేస్తుందన్న అనుమానం కూడా పీకే సడెన్‌ నిర్ణయానికి ఓ కారణం. అందుకే తనకంటే కూడా కాంగ్రెస్‌కు పటిష్ట నాయకత్వం, సంకల్ప బలం అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటు పేకే చేరికపై కాంగ్రెస్‌ సీనియర్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్‌లో కీలక పదవి పొంది పార్టీలోని నేతలందరినీ తన నియంత్రణలో ఉంచుకుంటారన్న ప్రచారం జరగడంతో గత రెండు రోజులుగా కాంగ్రెస్‌లో వివిధ దశల్లో కలకలం రేగింది. తాను చెప్పిన మార్పులు జరిగితే పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడం కాంగ్రెస్‌ నేతలకు ఎంతమాత్రం రుచించలేదని తెలుస్తోంది. ఒక్కోసారి ఒక్కో పార్టీకి పనిచేసిన పీకేను విశ్వసించలేమనే అభిప్రాయంతో వారు ఉన్నారు.

పైగా అతనికి సైద్ధాంతిక నిబద్ధత ఉండదన్న అభిప్రాయాన్ని ఓ వర్గం నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఈ పరిస్థితి ఎలా ఉన్నా.. టీకాంగ్రెస్‌కు మాత్రం హ్యాపీ అనే చెప్పొచ్చు. ఒకవైపు సోనియాతో, మరోవైపు కేసీఆర్‌తో పీకే భేటీల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయనే సంకేతాలు వెళ్లాయి. దీంతో గందరగోళంలో పడ్డ టీ కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు మాత్రం పీకే తాజా నిర్ణయంతో మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story