New Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు, ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటి వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో పాటు రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. వరద బీభత్సంతో జనజీవనం స్తంభించింది. కాగా ఢిల్లీలో భారీ వర్షాలతో విషాద ఘటన చోటు చేసుకుంది. వరదలతో ఓల్డ్ రాజిందర్‌నగర్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు.
భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరగా కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు. బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద ముంచెత్తుకు రావడంతో అక్కడున్న వారికి ఏం పాలుపోక క్షణాల్లోనే ముంచెత్తిన వరద ధాటికి నీటమునిగి ఇద్దరు యువతులు, యువకుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి.
పలువురు విద్యార్థులను రక్షించాయి. బేస్ మెంట్ లోని నీటిని బయటకు పంపి సహాయక చర్యలు సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగాఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు దిల్లీ మంత్రి అతిశీ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని మంత్రి అతిశీ తెలిపారు. కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, ఎంపీ బాన్సురీ స్వరాజ్.. ఈ ప్రమాదానికి ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాలాలు సరిగా శుభ్రపరచకపోవడంతోనే నీరు ఎగదన్ని బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తిందని అన్నారు. నేరపూరిత నిర్లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమైందని దుయ్యబట్టారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ వాటర్ బోర్డు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com