Indore: ఇండోర్‌లో ట్రక్కు బీభత్సం.. ముగ్గురు మృతి

ఇండోర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. ట్రక్కును జనాలపైకి దూసుకుపోనిచ్చాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలిలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కు కింద ఉన్న బైక్ ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో ట్రక్కు మంటల్లో దగ్ధమైంది.
సోమవారం ఇండోర్‌లోని ఎయిర్‌పోర్టు రోడ్డులోని శిక్షక్ నగర్‌లోని నిషేధిత ప్రాంతంలోకి ట్రక్కు ప్రవేశించింది. డ్రైవర్ బాగా మద్యం సేవించి ఉండడంతో ట్రక్కు ఎలా వెళ్తుందో కూడా స్పృహ లేక ఉన్నాడు. రోడ్డుపై ఉన్న జనాలపైకి ట్రక్కును పోనిచ్చాడు. ముగ్గురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయడపడ్డారు. దీంతో వాతావరణం అంతా భీతావాహంగా మారిపోయింది. భయాందోళనతో ప్రజలు ఆర్తనాదాలు, కేకలు వేశారు. అయితే గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తొలుత ట్రక్కు డ్రైవర్ రామచంద్ర నగర్ కూడలి దగ్గర ఇద్దరు బైకర్లను ఢీకొని వాహనాలను ఈడ్చుకుని పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కృష్ణ లాల్‌చందాని తెలిపారు. డ్రైవర్‌ను పట్టుకుని మల్హర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. బడా గణపతి ప్రాంతంలో చాలా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపాడని చెప్పారు.
ఇక కోపంతో ఉన్న స్థానికులు ట్రక్కును తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అలాగే మోటార్ సైకిల్ కూడా ట్రక్కు కింద ఇరుక్కుందని వెల్లడించారు. ఇంధన ట్యాంక్ పేలి ట్రక్కు కూడా దగ్ధమైందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com