Drown In River: అంత్యక్రియలకు వెళ్తుండగా పడవ బోల్తా .. ఆనంతలోకాలకు బంధువులు

హోలీ సందర్భంగా నదిలో మునిగి ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్యక్రియల కోసం పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నదిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరి కొందరిని స్థానికులు రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రతన్‌గంజ్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల దినేష్ గుప్తా శుక్రవారం హోలీ సందర్భంగా శారదా నదిలో మునిగి మరణించాడు.
కాగా, శనివారం ఆ వ్యక్తి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు రెండు పడవల్లో శారదా నదిని దాటేందుకు బయలుదేరారు. కొంత మంది కుటుంబ సభ్యులు, దినేష్ మృతదేహాన్ని తీసుకెళ్లిన పడవ ఒడ్డుకు చేరుకున్నది. అయితే 16 మంది వ్యక్తులు ఉన్న మరో పడవ నది మధ్యలో బోల్తాపడింది. స్పందించిన స్థానికులు పలువురిని కాపాడారు. అయితే ముగ్గురు వ్యక్తులు నదిలో మునిగి మరణించారు.
మరోవైపు మృతులను 32 ఏళ్ల సంజయ్, 30 ఏళ్ల ఖుష్బూ, 13 ఏళ్ల కుంకుమ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నదిలో పడిన రెండేళ్ల చిన్నారిని రక్షించి చికిత్స తర్వాత ఇంటికి పంపినట్లు చెప్పారు. కాపాడిన మరో 12 మంది ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com