Ayodhya: అత్తారింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు

Ayodhya: అత్తారింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు
విల్లు, పట్టు బట్టలు.. 3 వేల రకాల వస్తువులు

అయోధ్య రాములోరికి అత్తగారింటి నుంచి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి కోసం ఎన్నో కానుకలను వెంట తీసుకొచ్చారు. ఇందులో బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

అయోధ్యలో అడుగుపెట్టనున్న రామయ్యకు దేశవ్యాప్తంగా భక్తులు లెక్కలేనన్ని కానుకలు సమర్పించుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే తన అత్తగారి రాజ్యం నుంచీ రామచంద్రునికి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో తరలివచ్చారు. వారితోపాటు జానకిమాత జన్మించిన జనక్‌పూర్‌ ఆలయ పూజారి కూడా తరలివచ్చారు.భక్తులు తీసుకొచ్చిన వాటిలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు మిఠాయిలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాక శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, బంగారు విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాల వంటివెన్నింటినో భక్తులు బహుమతులుగా సమర్పించుకున్నారు.


త్రేతాయుగంలో సీతారాముల కల్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలు ఇచ్చాడని నేపాలీలు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాము ఇప్పుడు ఈ కానుకలను తీసుకొచ్చామన్నారు. వీటితో రాముడు కొత్త ఇంటిని అలంకరించుకుంటారని చెప్పారు.నేపాల్‌ భక్తులు తీసుకొచ్చిన కానుకలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగించారు.జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం ఇచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ బహుమతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చంపత్ రాయ్ రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. నేపాల్ , భారతదేశం ఆత్మ సంబంధం కలిగి ఉన్నాయి అని అన్నారు.

నేపాల్ నుండి ప్రారంభమైన జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం భర్ సనేష్ యాత్ర జనవరి 6 వ తేదీ రాత్రి సమయంలో రామయ్య జన్మ భూమి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని కరసేవకపురం చేరుకుంది. సుమారు 36 వాహనాల్లో 500 మందికి పైగా భక్తులు తమతో పాటు పండ్లు, మిఠాయిలు, బంగారం, వెండి సహా మూడు వేలకు పైగా కానుకలను తీసుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story