Thanthadi Beach: తంతడి బీచ్ లో అక్కాచెల్లెళ్ల మృతి
సరదాగా గడిపేందుకు సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తీరంలో ఫొటోలు దిగుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు మరో యువతిని భారీ అల సముద్రంలోకి లాగేసుకుంది. నీట మునిగిన ముగ్గురిని జాలర్లు కష్టపడి ఒడ్డుకు చేర్చినా.. అప్పటికే ఇద్దరు చనిపోయారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని తంతడి- వాడపాలెం బీచ్ లో ఆదివారం చోటుచేసుకుందీ విషాదం. అచ్యుతాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తీడకు చెందిన ఎన్.కనకదుర్గ, మాకవరపాలెం మండలం శెట్టిపాలేనికి చెందిన ఎండపల్లి నూకరత్నం అక్కాచెల్లెళ్లు. కనకదుర్గకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ అక్కాచెల్లెళ్లతో పాటు స్నేహితురాలు ఎలమంచిలి మండలం గొల్లలపాలేనికి చెందిన ద్వారంపూడి శిరీష, మరో ఐదుగురితో కలిసి ఆదివారం తంతడి- వాడపాలెం బీచ్ కు వచ్చారు. మధ్యాహ్నం వరకు సరదాగా గడిపిన వారంతా తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
తీరంలో ఫొటోలు తీసుకునే ప్రయత్నంలో కొండరాళ్లపై నిలుచున్న వారిని ఓ భారీ అల సముద్రంలోకి లాగేసింది. నూకరత్నం, శిరీష, కనకదుర్గ ముగ్గురూ సముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కేకలతో అక్కడే ఉన్న జాలర్లు అప్రమత్తమయ్యారు. అలలకు కొట్టుకుపోతున్న వారిని అతికష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు. వారిని వెంటనే పరవాడ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కాచెల్లెళ్లు నూకరత్నం, కనకదుర్గ కన్నుమూశారు. శిరీష పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com