waqf board bill: వక్ఫ్ బిల్లుపై జేపీసీ భేటీ రసాభాస

కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం మంగళవారం రసాభాసగా మారింది. ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంపీలు వాగ్వాదానికి దిగారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తనకు ఎదురుగా నీళ్ల కోసం పెట్టిన గాజుసీసాను టేబులుకేసి కొట్టగా ఆయన చేతివేళ్లకు గాయమైంది. అనంతరం పగిలిన బాటిల్‌ను ఛైర్మన్ వైపు కల్యాణ్ విసిరారు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది. బెనర్జీకి పార్లమెంటు ఆవరణలోని డిస్పెన్సరీలో ప్రథమచికిత్స చేసి కుట్లు వేశారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. భాజపా సభ్యుడు నిశికాంత్ దుబే తీర్మానం ప్రవేశపెట్టగా, 10-8 ఓటింగుతో ఆమోదించిన కమిటీ కల్యాణ్ బెనర్జీని సమావేశాల నుంచి ఒకరోజు సస్పెండు చేస్తూ నిర్ణయం తీసుకొంది. భాజపా ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశం ఒడిశాకు చెందిన రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదుల అభిప్రాయాలు వింటుండగా ఈ వివాదం తలెత్తింది.
జేపీసీ సమావేశంలో జరిగిన దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకొన్నట్లు ఛైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. సభ్యులను ఇలా వదిలేస్తే రేపటి సమావేశానికి మరొకరు రివాల్వరుతో వస్తారని మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. బాటిల్‌ను ఛైర్మన్ వైపు విసరడం తన ఉద్దేశం కాదని కల్యాణ్ బెనర్జీ విచారం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com