TMC: ఎన్నికల బరిలో యూసుఫ్ పఠాన్

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. మొత్తం 42లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 16మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం ఇచ్చిన దీదీ మరో 8 మంది సిట్టింగ్‌లను తప్పించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సహా పలు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మాజీ ఎంపీ మహువా మొయిత్రి సహా 42 మంది పేర్లతోకూడిన అభ్యర్థుల జాబితాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. సిట్టింగ్‌ల్లో 16 మందికి మరోసారి అవకాశం దక్కగా...నుస్రత్ జహాన్‌సహా 8 మంది ఎంపీలను తప్పించింది. 42మందిలో 12మంది మహిళలు కాగా...మాజీక్రికెటర్ యూసుఫ్ పఠాన్ సహా కొంతమంది కొత్తవారికి అవకాశం దక్కింది.
కోల్‌కతాలో నిర్వహించిన మెగా ర్యాలీలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ...లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే 42మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఎంసీ అధినేత్రి... వారిని ప్రజలకు పరిచయం చేశారు. అభిషేక్ బెనర్జీ డైమండ్ హర్బర్ స్థానం నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు. 2014నుంచి ఆయన ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆభియోగాలపై సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్ నుంచి బరిలోకి దిగారు. 2019లో తొలిసారి ఆమె ఇక్కడి నుంచి గెలుపొందారు. అసన్‌సోల్ నుంచి నటుడు శత్రుఘ్నసిన్హా రెండోసారి బరిలో దిగనున్నారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించారు. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్...దుర్గాపుర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.
మరో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ ప్రాతినిథ్యం వహిస్తున్న బహరమ్‌పుర్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీ...సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌కు కేవలం రెండుస్థానాలు ఇచ్చేందుకు ప్రతిపాదించగా ఆ పార్టీ తిరస్కరించింది. దీంతో భారతీయ జనతా పార్టీని ఒంటరిగా ఎదుర్కొంటానని ప్రకటించిన దీదీ...మొత్తం 42లోక్‌సభ స్థానాలకూ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ బంగాల్‌లో అన్ని స్థానాలకు టీఎంసీ తన అభ్యర్థులను ప్రకటించటంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని, నామినేషన్ల ఉపసంహరణ వరకు పొత్తుకు అవకాశం ఉందని పేర్కొంది. ఏదైన ఒప్పందం సంప్రదింపుల ద్వారా మాత్రమే జరగాలి తప్ప ఏకపక్షంగా కాదని... హస్తం పార్టీ అభిప్రాయపడింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com