Bombay IIT: ఇకపై కులం అడిగితే కఠిన చర్యలు

తోటి విద్యార్థుల కులం గురించి ఆరా తీస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఐఐటీ-బాంబే తమ విద్యార్థులను హెచ్చరించింది. కులగోత్రాలకు బదులు ఆటపాటలు, సినిమాలు, సంగీతంలో వారి ఆసక్తిని తెలుసుకుని ఇతరులతో కలసిపోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న దర్శన్ సోలంకి అనే బీటెక్ ఫస్టియర్ విద్యార్థి హాస్టల్ భవనం ఏడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఐఐటీ-బాంబే అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఐఐటీ-బాంబే క్యాంపస్‌లో కుల వివక్ష ఉందని, తన కులం గురించి తెలియగానే తోటి విద్యార్థుల ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని దర్శన్ తన తల్లితో ఫోన్‌లో చెప్పినట్టు ముంబై పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుల వివక్ష వ్యతిరేక పోస్టర్లను క్యాంపస్‌లో అతికించారు. తోటి విద్యార్థుల కులం గురించి వాకబు చేయకూడదని, అలాగే వారి జేఈఈ ర్యాంకు, గేట్ స్కోరును కూడా ఆరా తీయకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ స్కోర్లను బట్టి కూడా విద్యార్థుల కులాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. కులమత, లింగ భేదాలను ఎద్దేవా చేసేలా వ్యవహరించరాదని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com